ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్ రాజర్షిషా దిశానిర్దేశం

కలం, ఆదిలాబాద్ : ప్రకృతి వ్యవసాయంతో (Natural Farming) పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా, వాతావరణ మార్పులను తట్టుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అన్నారు. గురువారం బేలా మండలం చాంద్‌పల్లి గ్రామంలో సీపీఎఫ్ సంస్థ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ముందుగా సీపీఎఫ్ సహకారంతో దర్గాజీ అనే రైతు సాగు చేస్తున్న పంటలను, ఎరువుల తయారీ, పంట నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ విధానాలపై అధికారులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యానవన పంటలతో పాటు పత్తిలోనూ జీవామృతం, నీమాస్త్రం వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించారు. జిల్లాలోని 30 క్లస్టర్లలో బయో రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రానికి రూ.లక్ష విలువైన పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, వరద బాధితులకు ఉద్యానవన శాఖ ద్వారా పనస, మునగ, వెదురు మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు.

జిల్లాలో 35 నుంచి 36 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో పంట నష్టంపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 101 క్లస్టర్లలో జరుగుతున్న ఈ ప్రక్రియకు రైతులు సహకరించి ఏఈఓల వద్ద తమ వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున పత్తి తొలగించిన తర్వాత జొన్న, మొక్కజొన్నకు బదులుగా తక్కువ నీటితో త్వరగా పండే శనగ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు సాగు చేయాలని కోరారు.

పంటల అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో వీబీజీ రాంజీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పిస్తామని, దీనివల్ల ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి పంట కుంటలు, ఊటకుంటలు, పొలం బాటలు, ఇంకుడు గుంతలు, పశువుల తొట్టెలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని సూచించారు. బేలా మండలంలో త్వరలోనే కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. పత్తి ఏరివేత తర్వాత కట్టెలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని, వాటిని కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని రైతులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>