కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హౌసింగ్, డీఆర్డీఏ (సెర్ఫ్), పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలన్నారు. జిల్లాలో ఇంకా 767 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇండ్లను ఎందుకు నిర్మించుకోలేక పోతున్నారో లబ్ధిదారులతో కారణం రాయించుకుని వాటిని రద్దు చేయాలని సూచించారు.
ఇంకా ఎందుకు నిర్మించుకోవడం లేదు..
ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు 5 లక్షలు ఇస్తున్నా, ఇంకా ఎందుకు నిర్మించుకోవడం లేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాల (Indiramma Housing Scheme) పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ ఏఈ లకు ఇచ్చిన టార్గెట్ ను 2 వారాల్లో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో గుడిసెల లెక్కింపు సర్వే పూర్తి చేయాలన్నారు. గుడిసె ఉన్న ప్రతీ ఒక్కరు ఇందిరమ్మ ఇంటికి అర్హులు కాదని, గుడిసెలోనే వంట చేసుకుని జీవిస్తున్న వారికి ఇండ్లను మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. కొన్ని గ్రామాల్లో కొంతమంది సొంత ఇల్లు ఉన్నా.. పక్కన ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుని ఉంటారని, అలాంటి వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయవద్దని తేల్చి చెప్పారు. రెండు వారాల తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.
వీవో బిల్డింగులు ఎంత వరకు వచ్చాయి..
పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో జిల్లాలో కొనసాగుతున్న పనుల గురించి చర్చించిన కలెక్టర్ గ్రామాలకు మంజూరైన వీవో బిల్డింగుల నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయని ఏఈలను కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాకు ఇది వరకే 39 వీవో బిల్డింగ్ లు మంజూరు కాగా.. వాటిలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 180 వీవో బిల్డింగ్ లు మంజూరు అయ్యాయని, జిల్లాలోని అన్ని గ్రామాలలో వీవో బిల్డింగ్ ల నిర్మాణాలను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
నివేదిక ఇవ్వాలి..
పంచాయతీ రాజ్ శాఖ ఏఈల దినచర్య (డ్యూటీ చార్ట్) నివేదికను ఇవ్వాలని పీఆర్ఈఈ అశోక్ కుమార్ కు ఆమె సూచించారు. అలాగే కొడంగల్ నియోజక వర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, గుండుమల్, కొత్తపల్లి మండలాలలో ఎంపీడీవోలు, ఏఈలు వీవో బిల్డింగ్ ల నిర్మాణానికి స్థల సేకరణ చేసి వెంటనే నిర్మాణాలను ప్రారంభం చేయించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలలో వీవో బిల్డింగ్ లు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టి పూర్తి చేయించాలని అన్నారు. పేమెంట్ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, తప్పకుండా వస్తాయని ఆమె హామీ ఇచ్చారు.
గిడ్డంగుల నిర్మాణాలపై ఆరా..
మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన గిడ్డంగుల నిర్మాణాల గురించి అడిగి తెలుసుకొని వాటి నిర్మాణాలను వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులను కూలీల సంఖ్య పెంచి వేగంగా చేయించాలన్నారు. ఉపాధి హామీ పనులపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నెలకోసారి జరిగే మండల మహిళా సమాఖ్య సభ్యుల సమావేశానికి ఎంపీడీవోలు తప్పని సరిగా హాజరు కావాలని, ఆ సమావేశాల ద్వారా సెర్ఫ్ కార్యకలాపాల గురించి తెలుస్తుందన్నారు.
సెర్ఫ్ వింగ్ కు సంబంధించి మండలాల వారీగా మహిళా స్వయం సహాయక గ్రూపుల వివరాలు, బ్యాంకు లింకేజీ టార్గెట్లు, స్రీనిధి రికవరీ, ఎన్పీఏ, ఎంటర్ ప్రైజెస్, స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్, కిషోర బాలికల సంఘాల ఏర్పాటు, యూడీఐడీ సర్టిఫికెట్ల గురించి కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీఏ వెంకట్ రాములు, ఇన్ ఛార్జీ డీఎల్పీవో ఉదయ్ కుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పీఆర్ ఏఈలు, డీపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు.

