Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం: పోలీస్ కమిషనర్

కలం, కరీంనగర్ బ్యూరో: తమ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార భద్రతా పథకాలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారిమళ్లించి ప్రజల హక్కులను హరిస్తున్న వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్ రాజీలేని వైఖరిని అవలంబిస్తోంది. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించడమే కాకుండా, ప్రజలకు అందాల్సిన నిత్యావసర ధాన్య సరఫరా వ్యవస్థను దెబ్బతీసే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా (Ramagundam Police) స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్‌కు చెందిన బండారి మారుతి (43), కట్నపల్లిలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్, సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్‌పై ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేయబడింది. కమిషనర్ ఉత్తర్వుల మేరకు సోమవారం సుల్తానాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. రంజిత్ రావు, సుల్తానాబాద్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ కరీంనగర్ జిల్లా జైలుకు వెళ్లి జైలర్ సమక్షంలో నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, 2023–24 రబీ, ఖరీఫ్ సీజన్లలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు మొత్తం 11,213.040 మెట్రిక్ టన్నుల వరిని స్వీకరించి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన 7,624.867 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయకుండా అక్రమంగా ఇతర రైస్ మిల్లులకు విక్రయించినట్లు తేలింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.27 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

నిందితుడిపై 2024 నుండి 2026 మధ్య పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అదే తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మరో కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతను తిరిగి విడుదలైతే మళ్లీ ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీడీ యాక్ట్ అమలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

ప్రభుత్వ ధాన్యం అనేది పేదల హక్కు.

సీపీ మాట్లాడుతూ… “ప్రభుత్వ ధాన్యం అనేది పేదల హక్కు. ఆ ధాన్యాన్ని అక్రమంగా దోచుకుని బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగించే వారిపై సాధారణ క్రిమినల్ కేసులతోనే ఆగిపోము. అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు చట్టంలో ఉన్న అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తాము. సీఎంఆర్ బియ్యం అక్రమ దారిమళ్లింపులో పాల్గొన్న ప్రతి వ్యక్తి, నిర్వాహకుడు, సహకరించిన వారు, లబ్ధి పొందిన వారందరినీ గుర్తించి చట్టం ముందు నిలబెడతాము. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా మళ్లించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

అక్రమాలకు పాల్పడే వారు వెంటనే తమ కార్యకలాపాలను విరమించుకోవాలి. లేకపోతే కఠినమైన చట్టపరమైన చర్యలు, పీడీ యాక్ట్ సహా నిర్బంధ చర్యలు తప్పవు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం లేదా ఇటువంటి నేరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వారిపైనా సమానంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి” అని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కేసులో పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ పి. రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>