కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం దృష్ట్యా శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ వి. భుజంగరావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ila Tripathi) మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో డైట్ మెనూ పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి విద్యాసంస్థలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ఉండేలా చూసి, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నాణ్యమైన బోధన జరగేలా పర్యవేక్షణ పెంచి, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావిస్తూ వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం అంకితభావంతో పని చేయాలని, ముఖ్యంగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పెంచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, డీఎస్‌సీడీవో రజిత, జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.
Read Also: రాంగ్ రూట్‌లో ఆర్టీసీ బస్సు.. ఇంట్రెస్టింగ్‌గా మారిన పెండింగ్ చలాన్లు!
Follow Us On: Instagram

