రైతుల భూసమస్యలకు చెక్ పెట్టేందుకే రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: రైతులు, భూ యజమానుల ప్రయోజనాలను కాపాడుతూ, భవిష్యత్తులో వారికి ఎలాంటి భూ సమస్యలు తలెత్తకూడదనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే జరిపిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ ప్రక్రియకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా సాలూర మండలం ఫతేపూర్‌ (Fatehpur) లో కొనసాగుతున్న భూముల రీసర్వే (Land Resurvey) ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కావని అధికారులకు సూచించారు. రైతులు, పట్టాదార్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

ప్రతిరోజు సగటున 30 ఎకరాల చొప్పున సర్వేను నిర్వహిస్తూ, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, తమ దృష్టికి తేవాలన్నారు. సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్ రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>