కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra), పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, అతిథులు, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, అత్యవసర సేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

