Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష

కలం, కరీంనగర్ బ్యూరో: ఈనెల 21న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నిర్వహించే నీట్ పరీక్ష (NEET Exam) ను భద్రత నడుమ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విద్య, వైద్య, ఆర్టీసీ, పోలీస్, ఎన్పీడీసీఎల్ శాఖల అధికారులతో నీట్ పరీక్ష నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Chitra Mishra) మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు ఉంటుందని.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి పరీక్షకు 15 నిమిషాలు ఎక్కువ సమయం ఉంటుందన్నారు. అభ్యర్థులు పాస్ ఫోటో, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. ఆభరణాలు, షూలు ధరించి రావద్దని.. నిబంధనలు విధిగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిర్వహణ, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని NPDLL అధికారులను, పరీక్ష కేంద్రం వద్ద మందులతో శిబిరం ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షకు రెండు రోజుల ముందే అధికారులు.. పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు బృందంగా ఏర్పడి పరీక్ష నిర్వహణను విజయవంతం చేయాలన్నారు.

ప్రతి సెంటర్‌కు జిల్లా అధికారి నియామకం

పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా పరీక్ష కేంద్రానికి అదనంగా ఒక జిల్లా అధికారిని నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే రోజున యోగా దినోత్సవం సందర్భంగా ర్యాలీ ఉంటుంది కాబట్టి విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్నాపత్రం, సమాధాన పత్రాలు రవాణాకు ప్రత్యేక బందోబస్తు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పరీక్ష నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ పంకజ్ సింగ్, డీఈఓ ప్రశాంత్, అశోక్ రెడ్డి, ఏసీపీ సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>