కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

కలం, కరీంనగర్: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరగనున్న కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ (Karimnagar Collectorate) భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

శుక్రవారం రాత్రి కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నూతన కలెక్టరేట్ భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, అదనపు కలెక్టర్ల చాంబర్లు, మంత్రుల సమీక్ష సమావేశాల కోసం ఏర్పాటు చేసిన హాళ్లు, ఇతర గదులను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని సుందరంగా అలంకరించి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రారంభోత్సవం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వారికి స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయం చేసేందుకు లైజనింగ్ అధికారులను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేదిక, ప్రెస్ గ్యాలరీ, అతిథులు, ప్రజలు, మీడియాకు అవసరమైన సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఘనంగా, సమర్థవంతంగా జరిగేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, ఏవో సుధాకర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>