మెడికల్ షాపుల్లో అక్రమాలపై విచారణ జరపాలి: ఫార్మసిస్ట్ అసోసియేషన్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన ఫార్మసీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో ఫార్మసీ, ఔషధ విక్రయ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ (Pharmacist Association) అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీ సరోజినీ రాములమ్మ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మందుల సురక్షిత వినియోగం, ఫార్మసిస్టుల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

వేలాది మంది ఫార్మసిస్టులకు ఉపాధి కల్పించాలి

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఫార్మసీ విద్యను పూర్తి చేసిన వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేసి అర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగం లభించని ఫార్మసిస్టులు సొంతంగా మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అర్హత లేని వ్యక్తులతో మందుల విక్రయాలు వద్దు

మందుల దుకాణాల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పర్యవేక్షణలోనే ఔషధాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హత లేని వ్యక్తుల ద్వారా మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులు, ముఖ్యంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తదితర ఔషధాల విక్రయంలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. వైద్యుల సూచన లేకుండా మందులను విచక్షణారహితంగా వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

రాష్ట్రంలోని ఔషధ దుకాణాల లైసెన్సుల జారీ, రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల హాజరు, మందుల విక్రయ నిబంధనల అమలుపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫార్మసీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

సీసీ కెమెరాలు.. బయోమెట్రిక్ విధానం

ప్రతి మెడికల్ షాపులో రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల హాజరును నిర్ధారించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను తీసుకురావాలని అశోక్ కుమార్ కోరారు. మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. దీనివల్ల రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పేరుతో ఇతర వ్యక్తులు మందులు విక్రయించే పరిస్థితులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

ఫార్మసీ వ్యవస్థను బలోపేతం చేయాలి

వైద్య ఆరోగ్య వ్యవస్థలో మందుల సురక్షిత వినియోగంలో ఫార్మసిస్టులకు కీలక బాధ్యత ఉందని అశోక్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకొని ఫార్మసీ చట్టాల అమలు, ఖాళీ పోస్టుల భర్తీ, అర్హులైన ఫార్మసిస్టులకు ఉపాధి అవకాశాల కల్పనపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన మందుల విక్రయంలో నిబంధనలకు రాజీ ఉండకూడదని, రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు తగిన ప్రాధాన్యం కల్పించి ఫార్మసీ వ్యవస్థను బలోపేతం చేయాలని వాకిట అశోక్ కుమార్ తెలిపారు.

ర్యాలీలో విస్తృతంగా పాల్గొన్న విద్యార్థులు

ఈ కార్యక్రమంలో శ్రీ సరోజినీ రాములమ్మ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ డా. పనుగంటి బాలరాజ్, ప్రిన్సిపాల్ డా. టి. మంగీలాల్, అకాడమిక్ ఇన్‌చార్జ్ శ్రీమతి టి. సౌమ్య, ఐపీఏ వైస్ ప్రెసిడెంట్ ఎం.ఏ. అలీమ్ పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ ఫార్మసిస్టులు, సీనియర్ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>