కలం, హనుమకొండ: ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) అన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సందర్భంగా ఆదివారం ఉదయం హనుమకొండ (Hanumakonda) లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (JNS)లో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా నిపుణుల సమక్షంలో ఆసనాలు, ప్రాణాయామం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు లభిస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ప్రస్తుత జీవనశైలి మార్పుల కారణంగా వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటువంటి సమస్యలను నివారించడంలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ అన్నారు. యోగా సాధనకు ప్రత్యేక పరికరాలు, ఖరీదైన జిమ్‌లు లేదా పెద్ద ప్రదేశాలు అవసరం లేదని, ఇంట్లోనే కొద్దిపాటి స్థలంలో ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి యోగా చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, అనులోమ-విలోమ, భ్రమరి వంటి ప్రాణాయామాలు ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు.
ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్ ఓ డాక్టర్ దుర్గా రామ్ కుమార్, డీవైఎస్ ఓ ప్రశాంత్, డీపీఆర్ ఓ ఆయూబ్ అలీ, బోద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్, సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ మహేందర్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భాను, డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ జి. రాము, డాక్టర్ శోభారాణి, డాక్టర్ సతీష్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ మమతా మాధవి, ఇన్స్పెక్టర్లు ప్రభు చైతన్య, రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

