కలం, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై (Indiramma Family Insurance) ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 19 నుంచి 58 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి కుటుంబాన్ని ఈ పథకంలో నమోదు చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలోని 400 గ్రామ పంచాయతీలతో పాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల పరిధిలో గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పథకం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర బీమా పథకాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ బీమా ద్వారా ప్రయోజనం చేకూరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అర్హులైన వారందరూ పథకంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, సీపీఓ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

