కలం, వలిగొండ: ధాన్యం కొనుగోలు, ధాన్యం ఆన్ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) అన్నారు. బుధవారం మండలంలోని నాగారం గ్రామ పరిధిలో గల వాసవి రైస్ మిల్లును కలెక్టర్ అనురాగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రైస్ మిల్లులో ధాన్యం లోడు లారీలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. లోడ్‌తో వచ్చిన లారీలను ఎప్పటికపుడు అన్‌లోడ్ చేయాలన్నారు. ప్రతి రోజు ధాన్యం లోడుతో ఎన్ని లారీలు మిల్లుకు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఒక్కో లారీ అన్‌లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకొని, వచ్చిన వెంటనే హమాలీలతో అన్‌లోడ్ చేయించాలన్నారు. ధాన్యం అన్‌లోడ్ చేయడం కోసం మిల్లులో హమాలీలు సరిపడా ఉన్నారా? లేదా? అని ఆరా తీశారు. సరిపడా హమాలీలు లేకపోతే ఎక్కువ మందిని పెట్టుకొని ధాన్యం దిగుమతి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిల్లుల వద్ద ధాన్యం లోడ్‌తో వచ్చిన వాహనాలు ఆగడానికి వీలు లేదన్నారు. ఏ రోజు వచ్చిన లారీ ఆరోజే అన్‌లోడ్ చేసి పంపించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంట వెంటనే లారీలను తిరిగి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి రోజా రాణి, తహసీల్దార్ దశరథ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

