కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కలకం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, ఇతర విద్యా సంబంధిత పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన, జూన్ 6న తిరిగి భారత్‌కు రానున్నట్లు ప్రకటించారు. వ్యవస్థ లోపాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, దీనికి ప్రభుత్వం జవాబుదారీతనం వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇక జూన్ 6న ఉదయం తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటానని అభిజీత్ (Abhijeet Dipke) వెల్లడించారు. అక్కడ తన మద్దతుదారులతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కోసం అనుమతి కోరుతానని చెప్పారు. సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు ఈ విద్యా వ్యవస్థ తీరుతో ఆందోళన చెందుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కుతో శాంతియుత మార్గంలో గళం విప్పాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. సామాజిక మాద్యమాల వేదికగా విమర్శలు చేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పోరాడి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అభిజీత్ ప్రకటనతో ఢిల్లీలో జూన్ 6న ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు
Follow Us On: X(Twitter)

