ఏది ఏమైనా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, వైద్యం: CM రేవంత్

కలం, వెబ్ డెస్క్: సమాజంలో వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. రాష్ట్రాన్ని మంచి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను అసెంబ్లీ ముందు సీఎం వివరించారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య (Education), వైద్యం (healthcare) అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నిమ్స్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు రూ.3 వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి కలిపి రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

పేదలకు మరింత వేగవంతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రుల నిర్వహణ విధానంలో కూడా మార్పులు చేస్తున్నామని చెప్పారు. వైద్యులకే హాస్పిటల్ నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల వైద్యంపై దృష్టి సారించలేని పరిస్థితులు ఉంటున్నాయని.. అందుకని నిర్వహణ విభాగాన్ని వేరు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో గొప్ప పేరు గడించిన వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వెసులుబాటును బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పేదలకు వారి సేవలను అందించడానికి వీలుగా మెడికల్ అండ్ హెల్త్ వెబ్‌సైట్ ద్వారా ఒక వేదికను క్రియేట్ చేస్తున్నామన్నారు. విద్య పరంగా నర్సరీ నుంచి 10 వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>