కలం, వెబ్ డెస్క్ : ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, రాబోయే ఎనిమిది నెలల పాటు రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ బి.ఎం. సందీప్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పూర్తిగా ప్రజల తాగునీటి అవసరాలకే కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. దీంతో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఎల్నినో సంక్షోభం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలు దీని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇప్పటికే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

