‘సర్’ ప్రక్రియపై సీఎం రేవంత్‌ సీరియస్!: మంత్రులకు కీలక ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లు డిలీట్ అవుతున్నాయో ఈసీ నుంచి ప్రాథమిక సమాచారం వచ్చిందని, దాదాపు 21% మేర ఓట్లు తొలగిపోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, బూత్ లెవెల్ ఏజెంట్లను పర్యవేక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సమీక్ష నిర్వహించాలన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్లు చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులంతా రెండు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి వారివారి జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వారి పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఇన్‌చార్జీలు నాలుగు రోజులు నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెల్సుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందేనని ఆయన ఆదేశించారు.

ఇంకా నిర్లక్ష్యాన్ని పార్టీ ఉపేక్షించదు

సరైన కార్యాచరణతో ఫలితాలు సాధించకపోతే పార్టీ ఉపేక్షించదని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ‘సర్’ కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమే అయినా ఇది ఏఐసీసీ ఒక విధాన నిర్ణయంగా అన్ని రాష్ట్రాల్లోనూ అలర్టుగా ఉండాలని పార్టీ నేతలకు ఇచ్చిన ఆదేశాలని ఆయన గుర్తుచేశారు. ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల కారణంగానే ‘పార్టీ ఉపేక్షించదు’ అని చెప్పాల్సి వస్తున్నదని ఆయన అన్నారు. పకడ్బందీ కార్యాచరణతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద నష్టమే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. ‘సర్’లో సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని తదనుగుణంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

అర్హులైనవారిని తిరిగి చేర్పించాలి: మీనాక్షి

తెలంగాణలో 73 లక్షల మంది పేర్లు డిలీట్ అయ్యే అవకాశం ఉందని, దీన్ని పార్టీ సీరియస్‌గా తీసుకున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు. ఇవి కాక దాదాపు 64 లక్షల ఓట్లు ‘అనమలీస్’ పేరుతో పక్కకు పెట్టడాన్ని లీడర్లంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. జూమ్ కాన్ఫరెన్సులో ఆమె మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ ఓటర్ల డిలీషన్ జరగలేదని తెలిపారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆమె సూచించారు.

బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, డిలీట్ అయినవారిలో అర్హులైన ఓటర్లను గుర్తించి తిరిగి చేర్పించాలన్నారు. తొలగించే ఓట్లు కాకుండా ‘అనామలీస్’ పేరుతో 64 లక్షలు ఉన్నాయని, ఇవన్నీ కలిపితే దాదాపు కోటి 30 లక్షల మంది పేర్లు ప్రశ్నార్థకంగా మారనున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. ఇప్పటి నుంచి నాయకులందరూ ‘సర్’ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బీఎల్ఏలు వార్డులలో తిరిగి ప్రతీ ఓటును పరిశీలించాలన్నారు. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం జరిగినా సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటే ఎంత పెద్ద లీడర్ అయినా వారిపై పార్టీ నుంచి చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>