కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశాలు చేపడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ (BhavandlaPalli Yuganadhar) డిమాండ్ చేశారు. జిల్లాలో ర్యాంక్ ఫోర్డ్, గ్రావిటీ, బన్సల్ కళాశాలలకు అనుమతులు లేకున్నా అడ్మిషన్లు జరుగుతున్నాయని డీఐఈఓ కార్యాలయంలో ఏవో సుధాకర్‌కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం యుగంధర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని కాలేజీలు విచ్చలవిడిగా తప్పుడు ఫలితాలు ప్రచారం చేస్తూ, బోర్డులు పెట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని చెప్పారు.
గుర్తింపు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మిన్నకుండిపోవడం ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. అదే విధంగా జిల్లాలోని ఫాలో కళాశాలలకు ఎలాంటి అనుమతులు లేకుండానే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ Resonance IIT , JEE, NEET వంటి గుర్తింపు లేని కళాశాలను ప్రారంభించడం సరైంది కాదన్నారు.
ఆ కళాశాల ప్రారంభించడంలో ఉన్న మతలబేంటో ఆ ఐపీఎస్ అధికారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. జిల్లాలో కోకొల్లలుగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండానే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాల నడుస్తున్నప్పటికీ సంబంధిత విద్య శాఖ మంత్రి, స్థానిక మంత్రులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇకనైనా ఎటువంటి అనుమతులు లేని కళాశాలలు, పాఠశాలను సీజ్ చేసి సంబంధిత యజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చెంచాల మురళి, పిన్నమల్ల భాస్కర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Also: అర్జెంటీనా నుంచి వచ్చి యోగాసనంలో డబుల్ గోల్డ్
Follow Us On : WhatsApp

