Mobile Popup Ad
Mobile Popup Ad

విపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్

కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెడుతుందంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి విసిరిన బలమైన సవాల్‌ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. “మేమే గనుక రైతులకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం. ఒకవేళ మేము మీటర్లు పెట్టకుండా ఇలాగే నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తే.. తప్పుడు ప్రచారం చేస్తున్న మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారా? లేదా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తారా?” అని విపక్షాలను గట్టిగా ప్రశ్నించారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్

రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని, రాజకీయాల కోసం అమాయక రైతులను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాకబండలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు‌తో (Minister Tummala) కలిసి ఆయన ప్రారంభించారు. ​ఈ వేసవిలో దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు వచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం ముందస్తు ప్రణాళికల వల్ల ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అందుకే ఒక మిత్రుడు తెలంగాణను (కనురెప్ప కాలం కూడా విద్యుత్ అంతరాయం లేని రాష్ట్రం)గా అభివర్ణించారని చెప్పారు. 2023లో 15,000 మెగావాట్లుగా ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలోనే 18,548 మెగావాట్లకు చేరిందని.. విద్యుత్ డిమాండ్ పెరగడం రాష్ట్ర ఆర్థికవృద్ధికి, ప్రజల కొనుగోలుశక్తికి సూచికని భట్టి పేర్కొన్నారు.

భవిష్యతులో పెరగనున్న డిమాండ్

భవిష్యతులో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, డేటా సెంటర్స్ వంటి ప్రాజెక్టుల వల్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే మౌలిక సదుపాయాలను ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. ​2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం ఏటా 13.5 శాతం వృద్ధి రేటు సాధించేలా సమగ్ర ప్రణాళికను విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ వృద్ధికి అనుగుణంగా సాంప్రదాయేతర ఇంధన వనరులవైపు అడుగులు వేస్తూ.. 2030 నాటికి 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగానే 85 గ్రామాలను సంపూర్ణ సౌర‌విద్యుత్ గ్రామాలుగా మారుస్తున్నామని, రెండు మండలాల్లో వ్యవసాయ పంపుసెట్లకు 100% సోలరైజేషన్ చేపట్టామని చెప్పారు. అలాగే, గిరిజన భూములకు కరెంట్ కల్పించేందుకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ ద్వారా 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ వ్యవస్థను అందిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

రైతు డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం

రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం కోసం ఆర్థిక శాఖ ప్రతి నెల రూ.1,150 కోట్లు (సంవత్సరానికి దాదాపు రూ.14,000 కోట్లు) సకాలంలో చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనితో పాటు గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి, నష్టాలను తగ్గించడానికి అవసరమైతే థర్డ్ డిస్కమ్‌గా “రైతు డిస్కమ్”‌ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చివరగా, గ్రామాలు, పట్టణాల్లో స్తంభాలకు అడ్డగోలుగా వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిచేసుకోవడానికి నెలరోజుల సమయం ఇస్తామని, ఆ తర్వాత కూడా తొలగించని వైర్లను కట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మంలో మరిన్ని సబ్ స్టేషన్లు: తుమ్మల

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఉపకేంద్రాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు, భవనాలు, విద్యుత్, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>