కలం, వెబ్ డెస్క్ : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ చికిత్స పొందుతున్న గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆరా తీసి, ఆయన త్వరగా పూర్తి కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, నిన్న గుండె నొప్పితో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వెంటనే స్పందించిన యశోద వైద్య బృందం ఆయనకు పలు పరీక్షలు నిర్వహించగా, గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో నిన్ననే వైద్యులు ఆంజియోప్లాస్టీ నిర్వహించి విజయవంతంగా స్టంట్ వేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

