ఈనెల 19న సిద్దిపేటకు సీఎం .. సభాస్థలిని పరిశీలించిన మంత్రులు

కలం, మెదక్ బ్యూరో: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా నిర్వహణ కోసం అనువైన స్థలాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట్ స్వామి క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వేదిక నిర్మాణం, వాహనాల పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకల మార్గాలపై అధికారులతో సమీక్షించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. నవంబర్ 19న సిద్దిపేట వేదికగా జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే ‘ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని’ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. దీంతో పాటు మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలను సీఎం సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు.

అనంతరం ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Minister Vivek) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ బహిరంగ సభ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ సభ ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని (Indiramma Bheema Scheme) సీఎం ప్రారంభించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమావతి, వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>