కలం, వెబ్ డెస్క్ : కిషన్ రెడ్డి.. కల్వకుంట్ల కిషన్ రావుగా మారాడని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జైలులో చిప్పకూడు తినకుండా కేసీఆర్ (KCR) ను అడ్డుకున్నదెవరు అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. కల్వకుంట్ల కిషన్ రావుగా మారాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కేటీఆర్ దొంగపుత్రుడు అయితే.. కిషన్ రెడ్డి (Kishan Reddy) దత్తతపుత్రుడిగా మారాడన్నారు.
దొంగపుత్రుడు, దత్తతపుత్రుడు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ (MP Arvind) జిల్లాను అభివృద్ధి చేయకుండా.. మోడీ మంత్రం పఠిస్తున్నారని మండిపడ్డారు. గల్లీలో మోరీలు తీయాలంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలా అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు.
మూడుసార్లు మోడీ ప్రధాని అయినా, నిజామాబాద్ స్మార్ట్ కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దిగమింగారని మండిపడ్డారు. ద్వారా ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకున్నదని కిషన్ రెడ్డి అన్నారని.. 48 గంటలు టైం ఇస్తే అరెస్టు చేస్తాని కిషన్ రెడ్డి చెప్పిన మాటలను రేవంత్ గుర్తు చేశాడు. కేసీఆర్ అరెస్టుపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆరు నెలలైనా ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ నిలదీశారు.
నిజామాబాద్ రైతుల ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనేనని చెప్పారు. కేసీఆర్, హరీస్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ నాయకులు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కు పరపతి లేదు.. మోదీ దగ్గర ఆయన మాట చెల్లదని ఎద్దేవా చేశారు. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే లేదా మున్సిపల్ శాఖ మంత్రినైనా తన దగ్గరకు రావాలని, నిధులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామినిచ్చారు.
గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండటం సాధ్యం కాదని, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మనోళ్లు గెలవాలని.. అప్పుడే పనులు జరుగుతాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తనను రేవంతుద్దీన్ అని పిలిచినా ఎలాంటి సమస్య లేదన్నారు. అన్నికులాలు, మతాలను సమన్వయం చేసుకుని అభివృద్ధి పథం వైపు తీసుకువెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. ఫెవికాల్ బంధం అని ఎద్దేవా చేశారు. బీజేపీ కి ఓటు వేసినా, బీఆర్ఎస్ కు ఓటు వేసినా మూసీలో వేసినట్లేనన్నారు. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: సొంత ఇలాకాలో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ
Follow Us On: Instagram


