కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో నేడు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరి గుట్ట లో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని, వివిధ మఠాలకు భూముల కేటాయింపు పైన ఒక విధానం రూపొందించాలని తెలిపారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపు పైన స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలని.. భూమి యాజమాన్యపు హక్కులు టెంపుల్ వద్దనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే భూముల కేటాయింపు పైన తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గుట్ట పైన గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలన్న సీఎం.. విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. గెస్ట్ హౌస్ ల నిర్మాణం పైన తిరుమల మోడల్ ను అనుసరించాలని స్పష్టం చేశారు. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం పైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక పైన అధ్యయనం చేసి వారం లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ విధానం లో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

