బండి భగీరథ్‌ ఎపిసోడ్‌పై సీఎం సంచలన రియాక్షన్

కలం, తెలంగాణ బ్యూరో : మైనర్ బాలిక పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన బండి భగీరథ్‌ (Bandi Bhagirath)పైన తెలంగాణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని, ప్రొసీజర్ ప్రకారమే విచారణ, అరెస్టు జరుగుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. బండి భగీరథ్‌ను తానే స్వయంగా పోలీసులకు అప్పగించానంటూ బండి సంజయ్ చేసిన ప్రకటనను సీఎం తప్పుపట్టారు. అతను సరెండర్ కాలేదని, పోలీసులే నార్సింగిలోని తెలంగాణ పోలీసు అకాడమీ జంక్షన్ దగ్గర అరెస్టు చేశారని సీఎం క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ చెప్పినట్లుగా ఆయన తన కుమారుడిని పోలీసులకు సరెండర్ చేసింది నిజమే అయితే పోలీసుల్నే ఇంటికి పిలిపించుకుని అప్పగించి ఉండేవారన్నారు. పోలీసులే స్వయంగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా అరెస్టు చేశారో ప్రకటన ద్వారా బహిర్గతం చేశారని సీఎం గుర్తుచేశారు. బండి భగీరథ్‌ ఎపిసోడ్ అరెస్టే తప్ప సరెండర్ కాదని సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు.

నిర్దిష్ట ప్రొసీజర్ ప్రకారమే పోలీసు విచారణ :

పోక్సో కేసు విషయంలో పోలీసులు నిర్దిష్ట ప్రొసీజర్ ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీఎం వివరించారు. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్లే పోలీసులకు కొన్ని చట్టాలు, నిబంధనలు ఉంటాయన్నారు. బాధితురాలి కుటుంబం నుంచి ఫిర్యాదు రాగానే పోలీసులు పోక్సో కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ తర్వాత 24 గంటల్లోపే బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్నారని గుర్తుచేశారు. బాధితురాలు మైనర్ అని నిర్ధారించుకున్న తర్వాతనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. కోర్టు సైతం ప్రభుత్వాన్నిగానీ, పోలీసుల్నిగానీ తప్పు పట్టలేదన్నారు. బాధితురాలికంటే ముందే బండి భగీరథ్ కరీంనగర్‌లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని, అందులో బాధితురాలిని మేజర్‌గా పేర్కొన్నారని సీఎం తెలిపారు. దీంతో బాధితురాలు మైనరా లేక మేజరా అని తేల్చుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదన్నారు.

బాధితురాలి పట్ల కేసీఆర్‌కు అక్కరేది? :

బాధితురాలి కుటుంబ మానసిక ఆవేదనను అర్థం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి తప్ప శాడిజంతో వ్యవహరింకూడదన్నారు. దురదృష్టవశాత్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూర్చున్నారని, మైనర్ బాలికకు జరిగిన అన్యాయం విషయంలో ఇప్పటికీ స్పందించలేదన్నారు. మానసిక వేదనలో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులకు కనీసమైన ఓదార్పు కూడా ఇవ్వకపోవడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సమంజసమేనా అని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబంపైనా కేసీఆర్ తన వైఖరిని వెల్లడించలేదన్నారు. మరోవైపు కేటీఆర్ నడిపిస్తున్న సోషల్ మీడియాలో ఆ బాధితురాలి ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయని, ప్రపంచం మొత్తానికి మైనర్ బాలిక ఐడెంటిటీ ఎక్స్‌పోజ్ అయిందని, కేటీఆర్ శాడిస్ట్ మనస్తత్వం ఏంటో అర్థమవుతుందన్నారు.

బీఆర్ఎస్ లేడర్లే విచారణ, తీర్పు, శిక్ష ఇస్తున్నారు :

బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తరహాలో మాట్లాడుతున్నారు, విచారణ చేసేస్తున్నారు.. తీర్పు ఇచ్చేస్తున్నారు.. శిక్ష విధిస్తున్నారు.. అని సీఎం ఆరోపించారు. కేటీఆర్‌కు, బండి సంజయ్ మధ్య ఉన్న పంచాయితీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తరహాలో మాట్లాడి రాజకీయం చేయడం తగదన్నారు. పోలీసులు నిబంధనల ప్రకారం బండి భగీరథ్ విషయంలో నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారని, కానీ పోక్సో కేసులో ఏదో విజయం సాధించినట్లు బీఆరెస్ నేతలు శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలేగానీ, దిగజారి ప్రవర్తించొద్దని సలహా ఇచ్చారు. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ దొరికినప్పుడు పోలీసులు నిబంధనల ప్రకారం ఎలా వ్యవహరించారో ఇప్పుడు బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారని సీఎం వివరించారు. కానీ కేటీఆర్ తీరు మాత్రం బామ్మర్ది ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసు విషయంలో ఒకలాగ, ఇప్పుడు బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో మరోలా ఉన్నదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>