25 వేల ఇళ్లకు విముక్తి.. త్వరలో సీఎం ప్రకటన!

కలం, తెలంగాణ బ్యూరో: నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల భూములు, ఇళ్లు 22ఏ జాబితాలో చేరాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంతకంటే ముందే దాదాపు 25 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో చేరాయని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.

త్వరలోనే వీటికి విముక్తి కల్పించాలని భావిస్తున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో మంగళవారం నిర్వహించే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై విధానపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఇళ్ల యజమానులకు ఒకేసారి రిలీఫ్ కల్పించేలా ప్రభుత్వం పాజిటివ్ డెసిషన్ తీసుకోవచ్చని తెలుస్తోంది . ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నది.

బీఆర్ఎస్ దుష్ప్రచారం..

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏయే కాలనీల్లో ఎన్ని ఇళ్లు నిషేధిత జాబితాలోకి ఎక్కాయో అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఆ ఇళ్లు ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితాలోకి ఎక్కినవి కావని, గతంలోనే ఆ లిస్టులో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయా కాలనీల్లో బీఆర్ఎస్ నేతలు తిరిగి పొలిటికల్ సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. హరీశ్‌రావు తిరిగిన కాలనీల్లోని ఇండ్లు ఎప్పటి నుంచి నిషేధిత జాబితాలో ఉన్నాయో మంత్రి వెల్లడించారు.

ఎక్కడెక్కడ ఎన్ని?

* నిషేధిత జాబితాలో చేరిన ఇండ్ల వివరాలను జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం వెల్లడించింది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో 2,117 ఇళ్లు 22ఏ జాబితాలో ఉన్నాయి.

* మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 10,395 ఇండ్లు ఉన్నాయి. ఇవే నియోజకవర్గాల్లో యుఎల్సీ సమస్యలతో మరో 4,530 ఇళ్లు ఉన్నాయి.

* శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని కొన్ని కాలనీలే మొత్తంగా పీఓబీ రికార్డుల్లోకి ఎక్కాయి. వీటిలో దాదాపు 5,080 ఇళ్లు ఉన్నాయి.

ప్రతిపక్షాల కుట్రలకు కౌంటర్‌..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ఇళ్లు 22ఏ జాబితాలో చేరినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, అవన్నీ గతంలోనే చేరాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది బాధితుల కాలనీల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తీరును ప్రజల్లోనే ఎండగట్టేలా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఆ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని ఎక్స్‌పోజ్ చేయాలని అనుకుంటున్నారు. ‘‘దొంగే.. దొంగా దొంగా’’ అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదనే వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు.

ప్రజల బాధలకు కారణం కాంగ్రెస్ కాదు.. బీఆర్ఎస్ నిర్వాకమే అని స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఒకే విధాన నిర్ణయంతో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 22,122 ఇళ్ల యజమానులకు ఉపశమనం కలిగించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించాలి? ప్రత్యేకంగా దరఖాస్తులు ఆహ్వానించాలా? తగిన డాక్యుమెంట్లతో వివరాలు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలా?.. ఇలాంటివన్నీ త్వరలో ఖరారు కానున్నాయి.

నిషేధిత జాబితాలో ఏ నియోజకవర్గంలో ఎన్ని?

నియోజకవర్గం          ఇళ్లు
మేడ్చల్                6,198
కుత్బుల్లాపూర్         5,773
శేరిలింగంపల్లి         4,826
ఉప్పల్                 3,583
పటాన్‌చెరు            2,117
మహేశ్వరం            173
రాజేంద్రనగర్         81

పటాన్‌చెరు నియోజకవర్గం

బీహెచ్ఈఎల్ కాలనీ     1,146
సందిగూడెం కాలనీ       250
బోన్సాయ్ కాలనీ          182
బండ్లగూడ కాలనీ         112
శ్రీనగర్ కాలనీ             59 (అపార్టుమెంట్లు)
శ్రీరాంనగర్ కాలనీ        259 (అపార్టుమెంట్లు)
దుర్గా కాలనీ               56
ముంతంగి కాలనీ         53

మేడ్చల్ నియోజకవర్గం

దేవేంద్రనగర్      1,080
24 కాలనీలు       5,118 (రేణుకానగర్, వినోభా నగర్, తారకరామ నగర్, శ్రీ సాయి రామ్ నగర్, కృష్ణా హిల్స్, కాకతీయ నగర్, మరో 18 కాలనీలు)

ఉప్పల్ నియోజకవర్గం

బీజేఆర్ నగర్, లక్ష్మీ నరసింహ కాలనీ  1,623
జైపురి కాలనీ                                 574
ప్రథమ్‌పురి కాలనీ, ఈశ్వరపురి కాలనీ   536
చిలకానగర్, స్వరూప్‌నగర్                 850

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

పద్మానగర్             1,200
సుభాష్‌నగర్          1,950
గణేశ్‌నగర్ కాలనీ    1,000
కనకదుర్గా నగర్      1,000

శేరిలింగంపల్లి నియోజకవర్గం

అయ్యప్ప కాలనీ      2,776
రాజరాజేశ్వరి కాలనీ, గోల్డెన్ తులిప్, కేఎంఆర్ ఎస్టేట్, మాధవ హిల్స్, ఓయూ ప్రొఫెసర్ కాలనీ 1,089
రాఘవేంద్ర కాలనీ బ్లాక్, ఏబీసీ, ఆనందనగర్, హనుమాన్ నగర్ 508
శ్రీరామ్ నగర్ కాలనీ బ్లాక్   386
ప్రశాంత్ నగర్ కాలనీ       38
జూబ్లీ ఎంక్లేవ్                 29

రాజేంద్రనగర్ నియోజకవర్గం

అరవింద్ కాలనీ       44
బృందావన్ కాలనీ     18
వివేకానంద నగర్      19

మహేశ్వరం నియోజకవర్గం

రాఘవేంద్ర కాలనీ, గాయత్రి హోమ్స్ 173

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>