కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హియామత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలతో పాటు మూసీకి వచ్చే వరదలపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో..
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు గణేష్ ఉత్సవాలు వైభవంగా జరగబోతుండగా.. వర్షాలు పడుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఆదేశించారు. మండపాలు, నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమర్జెన్సీ సిబ్బందిని వెంటనే రంగంలోకి దించి, అత్యవసర సమయాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. పరిస్థితులను నిరంతరం సమీక్షించాలన్నారు.

