కలం, వెబ్ డెస్క్ : మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు చుట్టూ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన దగ్గరుండి వీక్షించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మీరాలం చెరువుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరంగా తెలియజేశారు.
ఈ తనిఖీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. బ్రిడ్జి పనులతో పాటు మిగిలిన అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే వరద నీరు చెరువు నుండి మూసీ నదిలోకి సులభంగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని ఆదేశించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున, ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనుగుణంగా డిజైన్లు రూపొందించాలని, చెరువులోని ఐలాండ్లను పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు.

