కలం, నారాయణపేట: రాబోయే దసరా సెలవుల్లోపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నారాయణపేట (Narayanpet) జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద ఉద్యోగుల సమస్యలపై గురువారం ధర్నా (Employees Protest) కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖలో జీవో 25 ను సవరించాలని కోరారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన వారిని సొంత జిల్లాలకు పంపాలని అన్నారు. ప్రభుత్వ పాలనలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ధర్నాలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ పటేల్ రాంరెడ్డి, జనార్దన్ రెడ్డి ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

