కలం, నిర్మల్: అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఎస్‌ఐఆర్ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహెర్ బీన్ ఆమ్దాన్ (Taher Bin Amdan) అన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. SIRలో భాగంగా విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేర్లలోనైనా తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, కాంగ్రెస్ పార్టీ సోన్ మండల అధ్యక్షులు మోహినొద్దీన్, గ్రామ కార్యదర్శి సుమయ తస్కిన్, ఆర్ఐ జ్ఞానేశ్వర్, జీపీఓ గంగాధర్, బీఎల్ఓలు పద్మావతి, గోదావరి, వార్డు సభ్యులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

