కలం, వెబ్ డెస్క్: మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైందని.. అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అడ్డా అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. చేనేత కార్మికులకు, చేతివృత్తులకు సిరిసిల్ల ప్రధాన కేంద్రమని అభివర్ణించారు. చేనేత రంగానికి గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో రూ. 2,234 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ. 1,751 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అగ్గిపెట్టెలో చీర ఇక్కడి నైపుణ్యత..
రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అగ్గిపెట్టెలో చీరను మడతపెట్టే నైపుణ్యం ఇక్కడి నేత కార్మికుల ప్రత్యేకత అని కొనియాడారు. చేనేత మగ్గాల నుండి సాంచెల వరకు వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు.
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు
ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉండేవని గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక విధానం అమలు చేస్తున్నట్లు సభావేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నామని వివరించారు.

