Mobile Popup Ad
Mobile Popup Ad

శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర భేష్: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ‘తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు’ ప్రత్యేక సంచికతోపాటు, రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వార్షిక పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు (Women Police) పోషిస్తున్న పాత్రను కొనియాడారు. పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సవాళ్లు, వారి అభివృద్ధికి కావాల్సిన సూచనలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, వృత్తిపరమైన ఎదుగుదల విషయంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించాలని వెల్లడించారు. తెలంగాణలో మహిళా పోలీసుల నాయకత్వ పటిమను పెంచేందుకు అవసరమైన నూతన విధానాలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా మహిళా సిబ్బందికి వృత్తిరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విశ్రాంతి గదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, బందోబస్తు సమయాల్లో సంచార మరుగుదొడ్లు, విధులకు అనువుగా వాహనాలను సమకూర్చడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ముఖ్యమంత్రికి వివరించారు.

శాంతిభద్రతల విభాగంలోనే కాకుండా, సాయుధ బలగాలు, బెటాలియన్లలోనూ మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరముందని మహిళా పోలీసులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. సివిల్ పోలీస్ విభాగంలో అమలవుతున్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తరహాలోనే, ఇతర విభాగాల్లోనూ మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాలని కోరారు. శిక్షణా కాలం నుంచే లింగ సమానత్వం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేలా సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు. విధి నిర్వహణలో సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫాం ప్రమాణాలను సమీక్షించేందుకు డీజీపీ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>