Mobile Popup Ad
Mobile Popup Ad

తండ్రి లేని కూతురి కష్టం.. సీఎం స్పందనతో ఇల్లు వరం

కలం, ఖమ్మం బ్యూరో : రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. నీడలేని జీవితం.. తండ్రి లేని లోటు.. ఇవన్నీ ఒక వైపు వేధిస్తున్నా, ఆ కష్టాలేవీ ఆమె చదువుకు అడ్డు కాలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టినా, తన ప్రతిభతో జాతీయ స్థాయిలో ఖమ్మం జిల్లా పేరును నిలబెట్టింది ఆ విద్యార్థిని. ఆ మెరుపు లాంటి ప్రతిభే ఆ కుటుంబ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి స్పందనతో కేవలం 24 గంటలలోనే ఆ కుటుంబానికి సొంతింటి కల నెరవేరింది. ఖమ్మం (Khammam)  నగరానికి చెందిన తురక దేవీప్రసన్న(Turaka Devi Prasanna) కథ ఇది. తండ్రి లేకపోయినా, తల్లి జ్యోతి ఎన్నో కష్టాలు పడుతూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ఏఎస్ఆర్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న దేవీప్రసన్న.. 434 మార్కులతో ప్రతిభ చాటుకుంది. అంతేకాదు, జాతీయ స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీలలో ప్రథమ స్థానం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చింది.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో దేవీప్రసన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా రూ.50 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. అయితే అదే వేదిక ఆ కుటుంబ జీవితాన్ని మార్చే మలుపు అవుతుందని ఎవరూ ఊహించలేదు. పురస్కారం అందజేస్తూ ముఖ్యమంత్రి ఆ విద్యార్థినిని పలకరించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. “నాన్న లేరు సార్.. అమ్మ కష్టపడి మమ్మల్ని చదివిస్తోంది.. మాకు సొంత ఇల్లు లేదు” అని దేవీప్రసన్న చెప్పిన మాటలు ముఖ్యమంత్రిని కదిలించాయి. వెంటనే స్పందించిన ఆయన, ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆదేశాలు రావడమే ఆలస్యం.. జిల్లా యంత్రాంగం వేగంగా కదిలింది. అధికారుల పరిశీలన అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ఇంటి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం 24 గంటలలోనే ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయంలో ఒక ఇల్లు కేటాయించారు. శనివారం నాడు అర్బన్ తహసీల్దార్ స్వయంగా వెళ్లి దేవీప్రసన్న కుటుంబానికి ఇంటి కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. సొంతింటి పత్రాలు చేతిలోకి తీసుకున్న ఆ కుటుంబ సభ్యుల కళ్లలో ఆనంద బాష్పాలు వెల్లువెత్తాయి. తమ బాధను గుర్తించి వెంటనే సహాయం అందించిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని తక్షణమే పరిష్కారం చూపడం నిజమైన ప్రజా పాలనకు నిదర్శనమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. చదువుల తల్లి ప్రతిభ.. ఒక నిరుపేద కుటుంబానికి సొంతింటి వరంగా మారిన అరుదైన ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>