కలం, డెస్క్ : బీఆర్ ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందని.. భార్య-భర్తలు మాట్లాడుకుంటే సీక్రెట్ గా విన్నారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. మంది ఫోన్లు వినేవారు అసలు మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ‘పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో తెలంగాణను మొత్తం దోచుకున్నారు. అది సరిపోదని అందరి ఫోన్లు విన్నారు. జడ్జిలు, పోలీసులు, పొలిటికల్ లీడర్లు, సినీ సెలబ్రిటీలను కూడా వదల్లేదు. అంత దారుణం చేసిన వాళ్లకు మొన్న పోలీసులు నోటీసులు ఇస్తే.. జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. భార్య-భర్తల ఫోన్లు వినేవాళ్లు జాతిపిత ఎలా అవుతారు. ఇలాంటి వారిని ముసుగులు వేసి పోలీసులు విచారణకు తీసుకురావాల్సింది. కానీ పోలీసులు మంచోళ్లు కాబట్టి ముసుగులు వేయలేదు’ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుంది. కేసీఆర్ సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ప్రజలకు ఇచ్చారా. ఉద్యమకారులకు కూడా తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు ఎలా అవుతుంది. అసలు కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు. రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అవుతారు. ఏపీలో పార్టీ చచ్చిపోయినా సరే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణకు తల్లి అవుతారు తప్ప.. కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నా’ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
‘మిర్యాలగూడలో (Miryalaguda) భాస్కర్ రావుకు ప్రజల్లో విలువ లేదు. ఆయన జానారెడ్డి దయతో ఎదిగాడు. జానారెడ్డి కన్నకొడుకుకు కాకుండా భాస్కర్ రావుకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. మిర్యాలగూడ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి మళ్లీ వస్తుంటే ప్రజలు ఎలా నమ్ముతారు. భాస్కర్ రావు కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరిస్తే ఊరుకునేది లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మున్పిపల్ శాఖ తన దగ్గరే ఉందని.. మిర్యాలగూడలో ఏమేం పనులు కావాలో అన్నీ తనకు తెలుసని.. ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ‘మిర్యాలగూడ, నల్లగొండకు ఉపయోగపడే ఎస్ ఎల్ బీసీని బీఆర్ ఎస్ హయాంలో పూర్తి చేసే అవకాశం ఉన్నా చేయలేదు. అందువల్లే ఇప్పుడు పనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. మనిషి చనిపోతే కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ బీఆర్ ఎస్ నేతలు మాత్రం మనుషుల మీద సింపతీ చూపించకుండా ఎస్ ఎల్ బీసీ ఆపేయండి అంటూ ప్రచారాలు చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గెలిపించి బీఆర్ ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).
Read Also: చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో సూసైడ్ కలకలం..
Follow Us On : WhatsApp


