కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ సహా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నెలకొన్న సమస్యలను ప్రధాని మోదీకి వివరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రలో 1500 ఎకరాల భూమి అడుగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అంగీకరిస్తుందా..!
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. దీని కోసం ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ కాలంలోనే అడుగులు పడ్డాయి. అయితే, బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. ఆ స్థాయిలో నిర్మిస్తే.. తమ భూభాగం నీటమునుగుతుందని కొర్రీలు పెట్టింది. 148 మీటర్ల వరకు మాత్రమే కట్టుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో, ఈ ప్రాజెక్ట్ దశాబ్ధాల కాలంగా పెండింగులో ఉంటూ వస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. మరోసారి దీన్ని తెరపైకి తెచ్చి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు.

