ధాన్యం సేకరణలో నిజామాబాద్ ఫస్ట్ -కలెక్టర్

కలం, నిజామాబాద్ బ్యూరో: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న సేకరణ పురోగతిపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్(Nizamabad) కలెక్టరేట్ నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహా పలువురు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలు కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని చెప్పారు. రవాణా కోసం అవసరమైన లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనకాడవద్దని సీఎం స్పష్టం చేశారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాలలో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు.

అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, వాతావరణ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (ILA Tripathi) మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు 88 శాతం పూర్తయ్యిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, డీఆర్‌డీఓ సాయన్న, మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>