కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడ జరిగిన మీడియా చిట్ చాట్ లో కేబినెట్ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కేబినెట్ లో ఉండటానికి 66 మంది ఎమ్మెల్యేలు అర్హులేనన్న సీఎం.. కానీ ఇచ్చేది 17 మంత్రి పదవులేనని వ్యాఖ్యానించారు. రకరకాల కారణాలతో కేబినెట్ ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆశావహులు ఇటీవల రాహుల్ గాంధీని కలవడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా రాహుల్ గాంధీని కలవొచ్చని పేర్కొన్నారు.
కిమ్ ను ఆదర్శంగా తీసుకున్న బీజేపీ
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అత్యంత బాధాకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను బీజేపీ ఆదర్శంగా తీసుకుందని ఎద్దేవా చేశారు. అసలు ఈ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ కు సంబంధించి ఎలాంటి కేసులు లేవని చెప్పారు. మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేసిందని ఆరోపించారు. ఇన్నాళ్లు బీజేపీ ఓట్ల చోరి చేస్తుందని భావించామని.. గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్ ఉదంతంతో సీట్ల చోరీ కూడా చేస్తుందని తేలిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ విషయంలో మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి తప్పుగా వ్యవహరించారన్న సీఎం.. బీజేపీకి అనుకూలంగా ఆయన పనిచేశారని ఆరోపించారు. లేని కేసు సృష్టించి నామినేషన్ తిరస్కరించారని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టడం వెనుక కూడా కుట్ర దాగి ఉందని వెల్లడించారు.

