పండుగ సాయన్న జయంతికి త్వరలోనే గుర్తింపు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న జయంతి (Panduga Sayanna) ని అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామనడంతో ముదిరాజ్ కులస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్ధారణ కమిటీ కలిసింది.

ప్రముఖ న్యాయవాది, పుస్తక రచయిత బెక్కం జనార్ధన్, పరిశోధకుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల కృష్ణ ముదిరాజ్ తదితరులు పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించారు.

అధికారికంగా జయంతితో..

పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తే ఆయన చరిత్ర, సామాజిక సేవ, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటి చెప్పే దిశగా చారిత్రక ముందడుగు అవుతుంది. ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న ఆకాంక్షకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంపై మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్‌కు ముదిరాజ్ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>