epaper
Sunday, March 1, 2026
epaper

ఈ ఏడాది నుంచే వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు : సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​: రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచే ప్రారంభించాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు. అన్ని సౌకర్యాలూ ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఇవి ఉండాల‌న్నారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వహించారు.

కార్పొరేటుకు దీటుగా ​​..

కోర్ అర్బన్​ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను లేటెస్ట్​ టెక్నాలజీతో, కార్పొరేట్ స్కూళ్ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. క్యూర్ ప‌రిధిలో 12 కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్​ నిర్మాణమూ ఏడాది లోపు పూర్తి కావాల‌ని చెప్పారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యాభ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వ‌స‌తులూ వీటిలో ఉండాల‌న్నారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 స్కూళ్ల ప‌నుల్లో ఎలాంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారంపాటు విద్యా సంబంధ అంశాల‌కు కేటాయించాల‌ని సూచించారు.

ఏఐ దిశగా చదువును నడిపించాలి..

ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) శాసిస్తోందని, అందువల్ల పాఠ‌శాల స్థాయి నుంచి ఏఐ బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చర్యలు తక్షణమే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను సీఎం (CM Revanth) ఆదేశించారు. ఏఐపై టీచర్లు, లెక్చరర్లకు శిక్షణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. AIతో వ‌చ్చే అవ‌కాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలా పాఠాలు, బోధన ఉండాల‌న్నారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించి, ఏఐ కోర్సులు ప్రారంభించాల‌ని చెప్పారు. ఇవి పూర్తి చేసిన వాళ్లకు వెంట‌నే ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా చూడాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తామ‌న్నారు. ఇప్పటికే ఉస్మానియా వ‌ర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మిగ‌తా వ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌మ‌నే దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్​ బాల‌కిష్టారెడ్డిని సీఎం ఆదేశించారు.

బ్రేక్​ఫాస్ట్​తోపాటు పాలు..

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. దీనిపై అధికారులు, హ‌రేకృష్ణ మిషన్​ ప్రతినిధులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ప్రతి విద్యార్థికి పాలు అందించాలని, విజ‌యా డెయిరీ నుంచి పాలను సేక‌రించాల‌ని ఆదేశించారు. అలాగే, విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాల‌న్నారు. అందులో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాల‌ని చెప్పారు. దీనికి కావాల్సిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చాలని అధికారుల‌ను ఆదేశించారు.

ఫీజుల నియంత్రణపై..

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. వివిధ రాష్ట్రాల్లో అమ‌లవుతున్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను సభ్యులు వివ‌రించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్​, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి, ఫీజుల కట్టడిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ స్థాయిలోని క‌మిటీ తుది నిర్ణయాలు తీసుకుంటుంద‌ని తెలిపారు. ఫీజు నియంత్రణకు సంబంధించి త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్తల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సీఎం సూచించారు. అనంతరం తెలంగాణ విద్యావిధానంపై తాము రూపొందించిన నివేదికను తెలంగాణ విద్యా కమిషన్​ ఆకునూరి మురళి, సభ్యులు సీఎంకు అందజేశారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో పర్యటించి, అత్యుత్తమ విధానాలు పరిశీలించి వీటిని రూపొందించినట్లు వాళ్లు సీఎంకు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!