కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల 12 వేల కొత్త కార్డులను జారీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదవాడికి సొంతిల్లు ఆత్మగౌరవం ఐతే, రేషన్ కార్డు ఆహార భద్రత అని పేర్కొన్నారు. ప్రస్తుత రేషన్ కార్డుల్లో 19 లక్షల 44 వేల కొత్త సభ్యుల పేర్లను చేర్చామని.. తద్వారా రాష్ట్రంలో 3 కోట్ల 38 వేల మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితి కల్పించామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోస పడిందని ఆనాటి రోజులను గుర్తు చేశారు. పదేళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి, ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రజాప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని అన్నారు. ఈ విషయంలో రాజీ లేకుండా, లౌక్యంతో, రాజకీయ విజ్ఞతతో పని చేస్తామని చెప్పారు. తెలంగాణకు వర ప్రదాయని ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం అన్నారు. ఫలితంగా మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలుగా, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలుగా తయారవుతున్నాయని చెప్పారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారని అన్నారు. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 42.90 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. గృహజ్యోతి కింద 53.09 లక్షల పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
విజయవంతంగా ఉద్యోగాల భర్తీ..
రాష్ట్రంలోని యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామని సీఎం వ్యాఖ్యానించారు. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణలు చేపట్టి రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామని.. నోటిఫికేషన్‌ల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని చెప్పిన రేవంత్.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యన్నత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు ఈ ఏడాది బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నామని తెలిపారు.
సెప్టెంబర్ 17 నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి..
పేదవాడు ధైర్యంగా, ఆత్మగౌరవంగా ఇది నా ఇల్లు అని బతికే పరిస్థితిని రాష్ట్రంలో తెస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. అందుకే మొదటి ఏడాదే రూ.22 వేల 500 కోట్లు కేటాయించి, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభించుకున్నామని.. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ప్రజాపాలన దినోత్సవం నాటికి మిగతా రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల ఉద్యోగాలకు, జీవితాలకు ఇన్నాళ్ళూ భద్రత లేదని సీఎం వ్యాఖ్యానించారు. వారి ఉద్యోగ భద్రత కోసం ఒక చట్టం చేశామని.. ఇందులో రాహుల్ గాంధీ చొరవకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

