కలం, స్పోర్ట్స్ : క్రికెట్ కెనడాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. సభ్యత్వ నిబంధనల ఉల్లంఘనలను చూపిస్తూ ICC తక్షణమే క్రికెట్ కెనడా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అయితే ఈ నిర్ణయం మధ్య కూడా కెనడా జాతీయ జట్లు ICC టోర్నీల్లో పాల్గొనే అర్హతను కొనసాగిస్తాయని స్పష్టం చేసింది. సోమవారం అహ్మదాబాద్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ బాధ్యతలకు సంబంధించిన తీవ్రమైన లోపాలు ఉన్నాయని ICC పేర్కొంది. ఈ నిర్ణయంపై స్పందించిన క్రికెట్ కెనడా, సస్పెన్షన్ ఊహించనిదిగా అనిపించిందని తెలిపింది.
ఇప్పటికే న్యాయ నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ పని ప్రారంభించిందని, మరో రెండు వారాల్లో మధ్యంతర సిఫార్సులు ఇవ్వాల్సి ఉందని వివరించింది. అయినప్పటికీ ICC నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అన్ని నిబంధనలను పూర్తిగా పాటించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ICC నుంచి నోటీసు వచ్చిన వెంటనే పరిపాలన, ఆర్థిక పర్యవేక్షణ, వ్యవస్థాపక లోపాలను సరిదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు క్రికెట్ కెనడా తెలిపింది. దీనిలో భాగంగా ICCకి సమగ్ర “కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్”ను సమర్పించినట్లు పేర్కొంది.
ఈ ప్రణాళికలో పరిపాలన, ఆర్థిక నియంత్రణ వ్యవస్థల్లో జరిగిన లోపాలపై పూర్తి స్థాయి విశ్లేషణను చేర్చినట్లు తెలిపింది. మొదటి 90 రోజుల్లో పాలన, ఆర్థిక నియంత్రణలు, నివేదికల వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ నిర్మాణంలో మార్పులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. అలాగే 90 నుంచి 180 రోజుల మధ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి అవసరమైన చర్యలు తీసుకునే ప్రణాళిక రూపొందించినట్లు వివరించింది.
సంస్థ ఇప్పటికే స్వతంత్ర న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీకి పూర్తి విచారణ, నిర్ణయాధికారాలు ఉంటాయని పేర్కొంది. కెనడియన్ న్యాయవాది, మాజీ జాతీయ క్రీడాకారిణి, గవర్నెన్స్ సలహాదారు డాషా పెరెగౌడోవా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారని వెల్లడించింది. ఈ కమిటీకి అన్ని ఆర్థిక రికార్డులను పరిశీలించే స్వేచ్ఛతో పాటు, సంబంధిత వ్యక్తులను ప్రశ్నించే అధికారం కూడా ఇచ్చినట్లు తెలిపింది. 14 రోజుల్లో మధ్యంతర నివేదిక, 45 రోజుల్లో పూర్తి విచారణ నివేదిక, ఆ తర్వాత సమగ్ర సంస్కరణల ప్రణాళిక అందించాల్సి ఉంటుందని వివరించింది.
ఇదిలా ఉండగా, ఫైనాన్స్ అండ్ ఆడిట్ కమిటీని మళ్లీ చురుకుగా మార్చడం, సవరించిన 2026 బడ్జెట్ సిద్ధం చేయడం, ఆడిట్ ప్రక్రియను వేగవంతం చేయడం, పరిపాలనపై తప్పనిసరి శిక్షణ అమలు చేయడం వంటి చర్యలు కూడా ప్రారంభించినట్లు క్రికెట్ కెనడా తెలిపింది. ICC గుర్తించిన అవకతవకలు ప్రస్తుత బోర్డు వల్ల కాకుండా గత యాజమాన్యాల కాలంలో ఏర్పడిన వ్యవస్థాపక బలహీనతల ఫలితమని సంస్థ స్పష్టం చేసింది. కొత్తగా ఎన్నికైన బోర్డు, ప్రస్తుత యాజమాన్యం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి, పరిపాలన, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఇప్పుడు ICC మార్గదర్శకాల ప్రకారం క్రికెట్ కెనడా చేపడుతున్న సంస్కరణలు ఎంత వేగంగా అమలవుతాయన్నది కీలకంగా మారింది.

