కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటివి మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గొడ్డలి పార్టీతో దూరంగా..
వైసీపీ గొడ్డలి పార్టీ విషంతో సమానమని, ఇది అందరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. మతం, కులాల పేరిట నిత్యం విద్వేషాలు రగిలించి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. అందుకే, ఆ పార్టీ నాయకులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలతో కలిసి తరచూ వేదికలు పంచుకుంటే.. ప్రజల్లో లేని పోని అనుమానాలు కలుగుతాయని చంద్రబాబు చెప్పారు. దీన్ని అవకాశంగా తీసుకుని వైసీపీ.. దుష్ప్రచారానికి పాల్పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
వారిద్దరి కారణంగానేనా..
ఇటీవల ముద్రగడ పద్మనాభం సంతాస సభలో టీడీపీ ఎమ్మెల్సీ బోండా ఉమ, వైసీపీ నేత అంబటి రాంబాబు కలిసి పాల్గొన్నారు. ఒకే చోట కూర్చోవడమే కాకుండా.. కార్యక్రమం ఆద్యంతం అత్యంత సన్నిహితంగా మెలగడంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
కాపులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని బోండా ఉమ పేర్కొనడం.. ఇది చంద్రబాబు దృష్టికి వెళ్లడంతోనే సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

