కలం, వెబ్ డెస్క్: ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే.. గొడ్డలి పార్టీ అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదలో సేవలో కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దుచేశారని.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల వరకు ఇస్తోందన్నారు. డీఎస్సీ పరీక్షపై 241 కేసులు వేసినా.. పారదర్శకంగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. కోడికత్తి నుంచి గులకరాయి కేసు వరకు.. వైసీపీ (YSRCP) నేతలు డ్రామా రాజకీయాలు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల, నంద్యాల, కడప ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీపై మండిపడ్డారు.
రాక్షస రాజకీయాల మధ్య కూడా సుపరిపాలన యజ్ఞం కొనసాగిస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ఒక్కో కుటుంబానికి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంధన ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను, పవన్ కల్యాణ్ కలిశామని ప్రస్తావించారు. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజు అని.. కూటమిగా ప్రజల అందరి మద్దతుతో అధికారం చేపట్టిన రోజు అని గుర్తు చేశారు.

