కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) బృందం సింగపూర్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. సోమవారం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సింగపూర్‌లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులను కలవడం, వారితో సంభాషించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కీలక ఆవిష్కరణలకు, సాహసోపేతమైన నిర్ణయాలకు, భవిష్యత్ పరిశ్రమల సృష్టికి మద్దతు ఇవ్వడంలో వెంచర్ క్యాపిటల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందుతున్న రంగాలలో అవకాశాలను సృష్టించడానికి తాము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి సంస్థలను కూడా స్థాపించామని వివరించారు. తమతో భాగస్వామ్యం కావాలని, విప్లవాత్మక ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం కావాలని వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదని.. సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్ధికశక్తి అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

