కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర పర్యాటక శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh), టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10 వేల హోం స్టేలను కూడా అందుబాటులోకి తేవాలన్నారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్‌మెంట్ పార్కులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు.
ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు..
అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పారు. దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలని సూచించారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద మరో రూ.663 కోట్లకు ప్రతిపాదనలు పంపామని అధికారులు వివరించారు. గండికోట, సూర్యలంక, బొర్రా గుహలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరఘాట్‌తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలన్నారు.

