కలం, స్పోర్ట్స్: శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ సంచలన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫఖర్ జమాన్ (Fakhar Zaman) అద్భుత శతకానికి తోడు.. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మరో 9 బంతులు మిగిలుండగానే 326 పరుగుల లక్ష్యాన్ని అందుకుని ట్రై సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కమిందు మెండిస్ 131 పరుగులతో వన్డేల్లో తొలి శతకం సాధించాడు. పవన్ రత్నాయకే 77 పరుగులతో రాణించాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో శ్రీలంక భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫఖర్ జమాన్, సాద్ బేగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. సాద్ బేగ్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఫఖర్ మాత్రం దూకుడు కొనసాగించాడు. 99 బంతుల్లో 127 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో అఫ్రాత్ మిన్హాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. హసన్ నవాజ్ 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పాకిస్థాన్ 48.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో వన్డే ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 656 పరుగులు చేయడం కూడా రికార్డుగా నిలిచింది. ఫఖర్ జమాన్ మరోసారి ఫైనల్లో తన సత్తా చాటగా.. అఫ్రాత్ మిన్హాస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

