కలం, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీజీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించడం ఒక హిస్టరీ అని సీఎం చంద్రబాబు ( CM Chandrababu) వ్యాఖ్యానించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని.. ఇప్పుడు కూడా వీబీజీ రామ్‌జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైందని తెలిపారు. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం నుంచి మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్‌జీ కింద రాష్ట్రంలో పనులు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనైనా చేపట్టవచ్చని, ముఖ్యంగా పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా నిర్మించుకోవచ్చని అన్నారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ‘స్వర్ణాంధ్ర’, ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ₹1100 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. దీంతో ప్రపంచంలోని అత్యుత్తమ ఆరు క్వాంటం కేంద్రాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని కొనియాడారు. కేవలం క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, క్వాంటం కంప్యూటర్ల తయారీ కేంద్రంగా కూడా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. మరో రెండేళ్లలో ‘అమరావతి మేడ్’ క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు.

