కలం, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర (Gangamma Jathara)లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu), నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గంగమ్మకు పట్టు వస్త్రాలను, తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం దంపతులు సమర్పించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో హడావిడి నెలకొంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పండుగలు, జాతరలు మన సంస్కృతిలో భాగమని అన్నారు. మన సంప్రదాయాలను ఆచరిస్తూ, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తుందని చెప్పారు. అందులో భాగంగా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించినట్లు తెలిపారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మేలు జరిగేలా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఏపీని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో చూడాలనే తమ ప్రయత్నాలకు ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్‌ను నిలిపి వారి వద్దకు వెళ్లి ‘ముంజలు తీసి ఇవ్వండి… రుచి చూస్తాం’ అని అడిగారు. సీఎం చంద్రబాబును చూసిన కార్మికులు సంతోషంతో తాజా తాటిముంజలను తీసి ఇవ్వగా సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా మాట్లాడి వారి పనితీరు, కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు.

