కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరుగుతున్న చమురు ధరలను ప్రస్తావిస్తూ.. మోదీ దేశద్రోహి అని విమర్శించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ‘బహుజన్ స్వాభిమాన్ సభ’ బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొద్ది నెలల్లో దేశంలో పెద్ద ఆర్థిక తుఫాను రాబోతోందని, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కడికో చేరుకుంటాయని అన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) విదేశీ పర్యటనలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రజలను విదేశాలకు వెళ్లవద్దని, బంగారం కొనవద్దని సలహాలు ఇస్తూ, తాను మాత్రం వేల కోట్ల రూపాయలతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు మౌనంగా ఉండటం సరికాదని రాహుల్ గాంధీ విమర్శించారు.
దేశంలో రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయని, మీ కళ్లముందే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు రాజ్యాంగాన్ని చింపి పారేస్తుంటే ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని, ఇది సామాన్య పౌరుల గొంతుక అని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పిలుపునిచ్చారు.

