కలం, నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పూర్తిగా నిద్రావస్థలో ఉందని, ప్రజా సమస్యలపై ఎలాంటి దృష్టి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthy Lingaiah) విమర్శించారు. కేతేపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడం మానేసి, ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం మాత్రం ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతోందన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన భరోసా ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట పండించడానికి రైతు మూడు నెలలు కష్టపడితే.. పంటను విక్రయించడానికి కూడా నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుబంధు, రుణమాఫీ, రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో తీవ్ర కొరత నెలకొందని, నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు దళారులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. రైతులకు భరోసా కల్పించే పరిస్థితి లేకుండా పోయిందని, ఏ పంట సాగు చేయాలనే దానిపై ప్రభుత్వ మార్గనిర్దేశనం లేకుండా పోయిందని వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా లేక రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మవిశ్వాసం దెబ్బతిందన్నారు.

