కాంగ్రెస్ పాలనపై చిరుమర్తి లింగయ్య ఫైర్

కలం, నకిరేకల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర అభద్రతాభావం, ఫ్రస్ట్రేషన్‌లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) తీవ్రస్థాయిలో విమర్శించారు. నకిరేకల్‌లో(Nakrekal) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సాగునీటి నిర్వహణ, పోలీస్ వ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు టర్మ్‌లు ఓడిపోయినా సరిపోయేంత ధనాన్ని కొద్ది నెలల కాంగ్రెస్ పాలనలోనే సంపాదించామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పుకోవడం వారి అహంకారానికి పరాకాష్ట అని లింగయ్య ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని పేర్కొంటూ.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై ఎలాంటి పట్టు లేదని లింగయ్య విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేవలం కేసీఆర్, ఆయన కుటుంబంపై రాజకీయ విమర్శలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ జిల్లాకు సాగునీటి కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర పక్షపాతం చూపిస్తోందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి నల్గొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. మరో 10–15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక చేలు ఎండిపోతున్నాయని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో దళితులు, బీఆర్ఎస్ శ్రేణులపై వేధింపులు తీవ్రమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పలగూడెంలో బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు సొంత ఖర్చులతో వినాయక మండపం షెడ్డు నిర్మిస్తే.. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రశ్నించిన దళితులు, బీఆర్ఎస్ శ్రేణుల ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి, అక్రమ కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా విధులు నిర్వహించాలని చిరుమర్తి లింగయ్య హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>