కలం, సినిమా : టాలీవుడ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (Bobby) తెరకెక్కించనున్న భారీ చిత్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘మెగా158’ (Mega158) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ముహూర్తపు పూజా కార్యక్రమానికి మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

